ఎన్నికల్లో కుటుంబసభ్యులతో కలిసి పోటీ చేసేందుకు రెడీ అయిన బాబు, జగన్

SMTV Desk 2019-02-26 15:51:21  YS Jagan mohan reddy, Chandrababu, TDP, YSRCP, TRS, KCR, KTR, Harishrao, Kavitha, YS Vijayamma, Nara lokesh, Nandamuri balakrishna

అమరావతి, ఫిబ్రవరి 26: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల ప్రధాన నాయకులే కాకుండా వారి కుటుంబ సభ్యలు కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సంబంధించి నలుగురు పోటీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్, తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, కుమార్తె కవిత పోటీ చేశారు. ఇకపోతే ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కుటుంబం, వైఎస్ కుటుంబం కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే పోటీ చేసేవారు. అయితే గత ఎన్నికల్లో ఆయన బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబు, బాలకృష్ణలతో పాటు నారా లోకేష్ కూడా పోటీ చేయనున్నారు. దీనిబట్టి చూస్తె 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉన్నారని తెలుస్తుంది. ఇకపోతే ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుండి వైఎస్ కుటుంబ సభ్యులు ఎంతమంది పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేయగా వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేశారు.

జగన్ తల్లి వైఎస్ విజయమ్మ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే కడప ఎంపీగా వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేశారు. ఇకపోతే కమలాపురం నుంచి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేశారు. మరోవైపు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఐదుగురులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాత్రమే పరాజయం పాలయ్యారు. మిగిలిన నలుగురు భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేస్తారన్నదానిపై సందేహం నెలకొంది. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత తిరిగి పులివెందుల నుంచి బరిలో దిగనున్నారు. కమలాపురం ఎమ్మెల్యేగా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తిరిగి పోటీ చెయ్యనున్నట్లు తెలుస్తోంది. అలాగే కడప పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి తిరిగి పోటీ చెయ్యనున్నారు. ఇకపోతే వైఎస్ జగన్ తల్లి వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నారు. అలాగే ఒంగోలు ఎంపీగా వైఎస్ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పోటీపై సందిగ్ధత నెలకొంది. అయితే వైవీ సుబ్బారెడ్డి మాత్రం తానే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే మెుత్తానికి వైఎస్ కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేస్తారా అన్న విషయంపై వైఎస్ జగన్ రెండురోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.