ఆర్టికల్ 35-ఎ పై సుప్రీంకోర్టులో విచారణ...కాశ్మీర్‌లో హైఅలర్ట్

SMTV Desk 2019-02-25 16:11:36  article 35a, jammu kashmir, supreme court, petition, jklf, yasin malik

జమ్మూ కాశ్మీర్, ఫిబ్రవరి 25: కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 35-ఎ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై నేడు విచారణ జరిపింది సర్వోన్నత న్యాయస్థానం. దీంతో జమ్మూ కశ్మీర్‌ అంతటా హైఅల్టర్ ప్రకటించారు. అంతేకాక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 100 కంపెనీ బలగాలను కశ్మీర్ అంతటా మోహరించారు. ఇందులో భాగంగా వేర్పాటువాద నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి 150 మంది వేర్పాటువాద నేతలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ సైతం ఉన్నారు. పుల్వామా ఉగ్రదాడితో వీరందరికి భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. కాగా, ఆర్టికల్ 35 ఎపై జమ్మూ కశ్మీర్‌లో రాజకీయ పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయాయి. గత శాసనసభ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలో మెజార్టీ స్థానాలను సాధించిన బీజేపీ ఈ ఆర్టికల్‌ను రద్దుకు మద్దతు తెలపగా, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఆర్టికల్ 35ఎపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోడానికి తమకు అనుమతి ఇవ్వాలని, ప్రస్తుతం ఎన్నికైన ప్రభుత్వం లేదు కాబట్టి విచారణను వాయిదా వేయాలని ఇటీవలే జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఫిబ్రవరి 11న జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది షోయబ్ ఆలమ్, వచ్చే విచారణ వాయిదా వేయాలని అభ్యర్థించారు.