ఢిల్లీలో మహాకూటమికి నిరాశ!

SMTV Desk 2019-02-25 16:02:28  Rahul Gandhi, Aravind Kejriwal, AAP, Congress, Alliance, Delhi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఓడించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఇప్పటి ఎన్నికల్లో అది సాధ్యమయ్యేలా లేదు. ఇప్పటికే రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని పక్కనబెట్టి ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) పొత్తులు పెట్టుకున్నాయి. ఢిల్లీలోనూ విపక్ష మహాకూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తమతో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధపడటం లేదని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం స్పష్టం చేశారు.

ఢిల్లీలో మహాకూటమి ఏర్పాటు కాకపోవడానికి కారణం కాంగ్రెస్ అని, ఆ పార్టీ తమతో పొత్తుకు ఎంతమాత్రం సిద్ధంగా లేదని, ఈ విషయంలో కాంగ్రెస్‌ దృఢనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోందని కేజ్రీవాల్‌ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షా లను అధికారంలోంచి దింపేయడమే దేశంలో ముందున్న అతిపెద్ద సవాలు అని, ఆ సవాలులో భాగంగా తమకు బద్ధవిరోధి అయిన కాంగ్రెస్‌తో పొత్తుకు తాము సిద్ధపడినా, ఆ పార్టీ మాత్రం అందుకు అంగీకరించడం లేదని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమవుతున్నామని ఆయన స్పష్టం చేశారు.