'సైరా' షూటింగ్ లో వివాదం...!

SMTV Desk 2019-02-25 16:00:38  Saira, Karnataka, Bidar, Muslim

కర్ణాటక, ఫిబ్రవరి 25: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సైరా . ఈ చిత్ర షూటింగ్ లో వివాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నాటకలోని బీదర్ లోని బహమనీ కోటలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో, బీదర్ కోటలో ఓ పత్యేక సెట్ వేశారు. ఈ సెట్ లో హిందూ విగ్రహాలను ఉంచారు. అయితే షూటింగ్ ను స్థానిక ముస్లిం యువకులు అడ్డుకున్నారు. కోటలోని ముస్లిం ప్రార్థనా స్థలంలో షూటింగ్ జరుగుతోందని, ఆ ప్రాంతంలో హిందువులకు చెందిన విగ్రహాలను పెట్టారని ఆరోపిస్తూ గుంపుగా వచ్చిన ముస్లిం యువకులు షూటింగ్ అడ్డుకున్నారు.

హిందూ విగ్రహాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ చిత్ర దర్శకుడితో పాటు, ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ పై కేసు నమోదు చేయాలన్నారు. చిత్ర బృందం ముందుగానే షూటింగ్ కు పురాతత్వ శాఖ అనుమతి తీసుకున్నప్పటికీ ఈ పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు వచ్చి హిందూ విగ్రహాలను, సెట్ ను తొలగించినట్టు సమాచారం. ఈ ఘటనతో కోట చుట్టుపక్కల ఉద్రిక్తత నెలకొంది. ముందు జగ్రత్త చర్యగా కోట పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.