పసుపు కండువా కప్పుకోనున్న విష్ణువర్ధన్ రెడ్డి

SMTV Desk 2019-02-25 13:48:01  Vishu Vardhan Reddy, Jaganmohan Reddy, Chandrababu Naidu, MLA, MLC, TDP, YCP

అమరావతి, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టికెట్టు రాని కొందరు నేతలు పార్టీ వలసలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ వైసీపీ నాయకుడు టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు తగిన ముహర్తం కూడా ఖరారు చేసుకున్నారు.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మొదటి నుండి వైసీపీ పార్టీ తరుపున కావలి సీటు కోసం గట్టిగ ప్రయత్నించాడు. కానీ జగన్ మాత్రం ఎమ్ఎల్ఏ కాకుండా ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చెబుతున్నాడట. కాగా ఇప్పటికే జగన్ చాలామందికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇస్తుండటంతో, నమ్మకం కుదరని విష్ణువర్ధన్ రెడ్డి, మొత్తానికి వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ నుండి కావలి ఎమ్ఎల్ఏ సీటును ఆశిస్తున్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో విష్ణువర్ధన్‌ రెడ్డి ఈ నెల 27వ తేదీన భేటీ కానున్నారు. కావలి నియోజకవర్గంలో టీడీపీ నుండి విష్ణువర్ధన్ రెడ్డినే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.