గ్రీస్ లో అతిపెద్ద ప్రాజెక్ట్ చేయనున్న జీఎంఆర్‌..

SMTV Desk 2019-02-23 17:07:59  GMR, airports, Greek

హైదరాబాద్, ఫిబ్రవరి 23: గ్రీస్‌ ప్రభుత్వం సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి నాంది పలికింది. ఈ మేరకు నిర్మాణ రంగంలో ప్రముఖ సంస్థ అయిన జీఎంఆర్‌ అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీస్‌లోని క్రీట్‌ రాజధాని నగరమైన హిరాక్లియోలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబందించిన కాంట్రాక్టును జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు అప్పగించారు.

కాగా గ్రీక్‌ కంపెనీ టెర్నా గ్రూప్‌తో కలిసి జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ మేరకు ఇరు సంస్థలు కన్సెషన్‌ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయి. ఒప్పందం కింద విమానాశ్రయ రూపకల్పన, నిర్మాణం, పెట్టుబడి, కార్యకలాపాలు, నిర్వహణను రెండు సంస్థల జాయింట్‌ వెంచర్‌ కంపెనీ చేపడుతుంది. ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.4,034 కోట్లు. కన్సెషన్‌ పీరియడ్‌ 35 ఏళ్లు. అయితే ఈ ప్రాజెక్టుకు రుణం అవసరం లేదని కంపెనీ తెలిపింది. కాగా యూరప్‌ ప్రాంతంలో తమ కంపెనీకి ఇది తొలి ప్రాజెక్టు అని జీఎంఆర్‌ ఎనర్జీ, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ బిజినెస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ బొమ్మిడాల తెలిపారు.