రైతు కుటుంబాలను ఆదుకున్న టాప్ హీరో

SMTV Desk 2017-08-03 14:31:26  THAMILA HIRO DHANUSH, Family of farmers, Shankarapuram village, Karuppasami temple, Director Subramania Shiva Cameraman

చెన్నై, ఆగస్టు 3 : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు ప్రముఖ సినీ నటుడు వారికి ఆర్థిక సహాయాన్ని అందజేసి, తన సొంతురైన శంకరాపురం గ్రామస్థులచే ప్రశంసలందుకున్నారు. తేని జిల్లా శంకరాపురంలో ధనుష్‌ కుల దైవమైన కరుప్పస్వామి ఆలయం ఉంది. ప్రతియేటా ధనుష్‌ కుటుంబ సమేతంగా ఆ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ మేరకు బుధవారం ఉదయం ధనుష్‌, ఆయన సతీమణి ఐశ్వర్య, తల్లిదండ్రులు కస్తూరి రాజా, విజయలక్ష్మి తదితర కుటుంబీకులతో అక్కడికి వెళ్ళి కరుప్పసామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత పంటనష్టాల్లో ప్రాణాలు కోల్పోయిన 125 మంది రైతుల కుటుంబాలకు ఆయన రూ. 50 వేల చొప్పున రూ. 63 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ధనుష్ మీడియాతో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం వంటి సంఘటనలపై తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలిపారు. అందుకే రైతుల కుటుంబాలకు తన వంతు సాయం అందించేందుకు దర్శకుడు సుబ్రమణ్యశివ, కెమెరామెన్‌ వేల్‌రాజ్‌ నాయకత్వంలో 11 మంది సభ్యులున్న కమిటీని ఏర్పాటు చేసి రైతన్నలను కోల్పోయిన 250 కుటుంబీకులను ఎంపిక చేశారని, తొలివిడతగా 125 మందికి యాభైవేల చొప్పున ఆర్థిక సహాయం అందించానని ఆయన వెల్లడించారు. మరో విడతలో 125 మంది రైతుల కుటుంబాలను ఎంపిక చేసి వారికి కూడా త్వరలోనే సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.