మోదీ, కేసీఆర్ లపై చంద్రబాబు ఫైర్..

SMTV Desk 2019-02-21 19:21:53  Chandrababu, Naredndra Modi, Andhra Pradesh, jagan, kcr, trs, ycp, bjp

అమరావతి, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ వలసలు అధికార టీడీపీలో ఇంకా అధికంగా జరుగుతున్నాయి. దీనికి కారణం తెరాస పార్టీ టీడీపీ నేతలను బెదిరించటమే అని వార్తలు కూడా ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు టీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో ఆస్తులున్న టీడీపీ నేతలను టీఆర్‌ఎస్‌ పార్టీ వేధిస్తోందని, తాము చెప్పినట్టుగా పనిచేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఈరోజు అమరావతిలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ నేతల ఆస్తులపై మోదీ ఐటీ దాడులు చేయిస్తున్నారని అన్నారు. కాగా బెదిరింపులకు తాము భయపడమని ఎదిరించి పోరాడతామని స్పష్టం చేశారు. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు అలాగే పోయేటప్పుడు ఏమీ తీసుకుపోమంటూ వేదాంతం చెప్పుకొచ్చారు. ఆస్తులు పోయినా ఆత్మ గౌరవం కోసం పోరాడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ ని నాశనం చెయ్యడానికి ప్రతిపక్ష నేత జగన్ ని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.