బీసీలకు వరాల జల్లు కురిపించనున్న జగన్..

SMTV Desk 2019-02-13 20:08:53   ys jagan, ysrcp, bc leaders, bc garjana sabha, ap assembly elections 2019, bc garjana in eluru

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13: ఇటీవల టీడీపీ నిర్వహించిన జయహో బీసీ సభ తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ గర్జన పేరుతొ ఓ సభ నిర్వహించనుంది. ఈ సభను వైసీపీ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ సభపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన ఇంట్లో వైసీపీ బీసీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని బీసీలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు జగన్ గత ఏడాది బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ బీసీ నేతలైన బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారధి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, జంగా కృష్ణమూర్తిలతో సమావేశమైన జగన్ బీసీ గర్జన సభకు సంబంధించి పలు అంశాలపై ముచ్చటించారు.

కాగా జగన్ ఏర్పాటు చేసిన బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి బీసీ వర్గాల ప్రజలు పడుతున్న బాధలు, ఇబ్బందులు... వాటి పరిష్కారానికి సంబంధించి పలు సూచనలు సలహాలు ఇస్తూ నివేదికను తయారు చేసింది. ఆ నివేదికను జగన్ కు బీసీ నేతలు సమర్పించారు. ఈ సందర్బంగా ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించబోయే బీసీ గర్జన సభలో ఇవ్వాల్సిన హామీలపై చర్చించారు.