జయరామ్ మృతదేహన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళిన రాకేష్ రెడ్డి..

SMTV Desk 2019-02-13 19:16:36  chigurupati jayaram, sika chowdary, padmasri, hyderabad police, telangana government, rakesh reddy, srinivas reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ప్రముఖ వ్యాపారవేత చిగురుపాటి జయరామ్ హత్య కేసులో రోజు రోజుకి నిగ్గు తేల్చే నిజాలు బయటపడుతున్నాయి. జయరాం హత్య కేసులో ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదన్న ఆయన భార్య పద్మశ్రీ కేసును త్తెలంగాణకు బదిలిచేయాలని కోరారు. ఈ నేపథ్యంలో జయరాం హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డిలను బంజారాహిల్స్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని మూడు రోజుల పాటు విచారణ చేపట్టారు. మొదటి రోజు విచారణలోనే పోలీసులు పలు కీలక విషయాలను తెలుసుకున్నారు. హత్య జరిగిన ర్రోజు రాకేష్ రెడ్డి ఇద్దరు పోలీసు అధికారులతో పలుమార్లు ఫోన్ లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. కారులో జయరామ్ మృతదేహన్ని తీసుకొని నల్లకుంట పీఎస్‌ వద్దకు రాకేష్ రెడ్డి వెళ్లినట్టు సమాచారం.

జయరాం హత్య కేసులో పోలీసులు మొదటి రోజు రాకేష్ రెడ్డి ని విచారించగా నిందితుడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. జయరాం దగ్గర డబ్బు రాబట్టేందుకు ఓ అమ్మాయి ఆయనను పిలిపించినట్టుగా రాకేష్ రెడ్డి చెప్పారు. గత నెల 31వ తేదీన జయరామ్‌ను మధ్యాహ్నం హత్య చేసినట్టు రాకేష్ రెడ్డి ఒప్పుకొన్నారు. జయరాం చనిపోయాక ఏం చేయాలని పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్టుగా తెలిపారు. నల్లకుంట సీఐ శ్రీనివాసరావు‌తో 13 సారులు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో 29 సారులు రాకేష్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. జయరామ్ నోట్లో బీరు పోయాలని పోలీసు అధికారులు ఇచ్చిన సలహాతోనే జయరామ్‌ చనిపోయిన తర్వాత ఆయన నోట్లో బీరు పోసినట్టుగా రాకేష్ రెడ్డి వెల్లడించాడు. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ఉద్దేశ్యంతోనే రాకేష్ రెడ్డి జయరాం నోట్లో బీరు పోసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. కాగా రాకేష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన ఇద్దరు పోలీసు అధికారులు నల్లకుంట సీఐ శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిని సస్పెండ్ చేసారు.