జనసేన అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసిన పవన్..

SMTV Desk 2019-02-12 23:04:52  pawan kalyan, janasena, madasu gangadharam, election screening committee, ap assembly elections 2019, vijayawada

విజయవాడ, ఫిబ్రవరి 12: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల సమరానికి సిద్ధం అయ్యారు. 2019 ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బయోడేటా అందించారు. పవన్ పోటీపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఆమోద ముద్ర వేసింది.

అనంతరం కమిటీతో సమావేశమైన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న అభ్యర్థుల నుంచి బయోడేటాలు సేకరించే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ.. మాదాసు గంగాధరం నేతృత్వంలోని ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థులు తమ బయోడేటాను ఈరోజు నుంచి అందించాలని అన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా నీతి, నిబద్ధతగా ఉన్న వ్యక్తులను ఎంపిక చెయ్యాలని సూచించారు. అభ్యర్థులు కూడా పక్క మార్గాల నుంచి కాకుండా న్యాయమైన మార్గంలో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా సమర్పించాలని కోరారు.