బీజేపీ అన్యాయాన్ని దేశానికి తెలియజేశాము: చంద్రబాబు

SMTV Desk 2019-02-12 11:23:04  Chandrababu Naidu, Narendra Modi, Central Government, TDP, YCP, BJP

అమరావతి, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష సఫలమయ్యింది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కేంద్రం పట్ల జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్లడంలో దీక్ష విజయవంతమైందని చంద్రబాబు తెలిపారు. దీక్ష ముగిసిన తరువాత ఈరోజు ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మోదీ మోసాన్ని, బీజేపీని ఎండగట్టడంలో దీక్ష ద్వారా విజయవంతమయ్యామని నేతలకు వివరించారు. అయితే, ఈ దీక్ష ఇంతటితో ఆగిపోలేదని, ఈ పోరాటాన్ని ఆపకుండా ఇక్కడి నుంచే నేరుగా ప్రజల్లోకి వెళ్లి పోరాడాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో బీజేపీ చచ్చిన పాముతో సమానమని, దాన్ని ఇంకా దాన్ని కొట్టి లాభం లేదన్నారు. ప్రధాని మోదీకి మనం గౌరవం ఇవ్వడం లేదని వైసీపీ నేతలు మాట్లాడడంతోనే బీజేపీతో వారి ఉన్న బంధం బయటపడిందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెడుతున్న జగన్‌ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సూచించారు. బురద పాములాంటి వైసీపీ, బీజేపీతో కలిసి కుట్రలు పన్నుతోందని, దీన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు.