వడ్డీ రేట్లపై కోత విధించిన ఆర్బీఐ

SMTV Desk 2017-08-03 10:13:35  RBI, URJITH PATEL, INTREST RATES

హైదరాబాద్, ఆగష్టు 3 : వడ్డీ రేట్లు తగ్గించమంటూ వస్తున్న విజ్ఞప్తులపై ఎట్టకేలకు భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) స్పందించింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మూడో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును స్వల్పంగా 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నాయకత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబర్‌ తర్వాత ఆర్బీఐ రెపో రేటు తగ్గించడం ఇదే మొదటిసారి. ఆర్థిక వ్యవస్థలో మిగులు నిధుల సరఫరాను తగ్గించేందుకు బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే స్వల్ప కాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటు (రివర్స్‌ రెపో)ను ప్రస్తుత 6 శాతం నుంచి 5.75 శాతానికి కుదించారు. అయితే కీలకమైన నగదు నిల్వల నిష్పత్తి(సిఆర్‌ఆర్‌)ను మాత్రం యథాతథంగా ఉంచారు. బ్యాంకుల మొండి బకాయిల సమస్య పరిష్కరించడంతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన పునర్‌ వ్యవస్థీకరణకూ కట్టుబడి ఉన్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ పటేల్‌ చెప్పారు. ఇందుకోసం ఆర్బీఐ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్టు తెలిపారు. ద్రవ్వోల్బణాన్ని రెండు శాతం అటు ఇటుగా నాలుగు శాతం దగ్గర కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఆర్బీఐ సమీక్ష ముఖ్యాంశాలు # రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు # రివర్స్‌ రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి కుదింపు, సిఆర్‌ఆర్‌ యథాతథం # రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం మించకుండా కట్టడి చేయడంపై దృష్టి # రాష్ట్రాల వ్యవసాయ రుణాల మాఫీలతో ప్రభుత్వ పెట్టుబడులకు ప్రమాదం # జిడిపి 7.3 శాతం వృద్ధి చెందుతుందన్న అంచనాల్లో మార్పు చేయలేదు.