మోదీ వంటి ప్రధానిని చూడలేదు : కాంగ్రెస్ నేత

SMTV Desk 2019-02-11 18:38:26  gulam nabi azad, congress, tdp, chandrababu naidu, gulam nabi azad interesting comments on chandrababu naidu, narendra modi, bjp

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీలో తలపెట్టిన ధర్మపోరాట దీక్షకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ హాజరయ్యి తమ మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం చంద్రబాబు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద 12 గంటల పాటు దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా గులాం నబి ఆజాద్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ వంటి ప్రధానిని ఇంత వరకు చూడలేదు... ఇక భవిష్యత్తులో కూడ అలాంటి పీఎంను తాను చూడబోనని అన్నారు. తాను చాలా సంవత్సరాల తర్వాత ఏపీ భవన్‌కు వచ్చినట్టుగా ఆజాద్ గుర్తు చేసుకొన్నారు. చంద్రబాబుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆజాద్ చెప్పారు.

కాగా తమ ఇద్దరి మధ్య 28 ఏళ్ల పరిచయం ఉందని ఆయన చెప్పారు. మోదీ అనుసరించిన విధానాల వల్ల దేశంలో రైతులు ఆందోళనలకు దిగారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను చట్టంలోనే తమ పార్టీ పెట్టిందన్నారు. కానీ మోదీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయలేదని ఆయన చెప్పారు. అలాగే ఏపీ విభజన సమయంలో రాజ్యసభలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసారు కానీ అధికారంలోకి వచ్చాక ఇవ్వలేదని పేర్కొన్నారు.