పుట్టిన బిడ్డ చనిపోయాడని నమ్మించి వేరొకరికి అమ్మే ప్రయత్నం

SMTV Desk 2019-02-09 10:45:50  Baby boy, theft, Vijayawada, Machilipatnam,

మచిలీపట్నం, ఫిబ్రవరి 09: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పుట్టిన బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పి ఆ బిడ్డని వేరొకరికి అమ్మేందుకు ప్రయత్నించిన ఘటన జవ్వారుపేటలో చోటుచేసుకుంది. మచిలీపట్నంలోని జవ్వారుపేటలోని వాణి హాస్పిటల్‌లో కనకదుర్గ అనే మహిళ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అయిన కొద్దిసేపటికే చిన్నారి చనిపోయిందని ఆసుపత్రి వర్గాలు బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు ల్యాబ్ టెక్నీషియన్లను తమదైన శైలిలో విచారించడంతో చిన్నారిని ఆసుపత్రి సిబ్బందే అపహరించి విజయవాడకు తరలించినట్లు తేలింది. ప్రస్తుతం ఈ చిన్నారి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం. కాగా, చిన్నారిని తీసుకొచ్చేందుకు పోలీస్ అధికారులు విజయవాడకు బయలుదేరారు.