జయరాం హత్యా కేసులో ఐదుగురు నిందితులు?

SMTV Desk 2019-02-09 08:19:57  Jayaram, Shikha Choudary, Five Members Interfere, Police Investigation, Padmasri

హైదరాబాద్, ఫిబ్రవరి 09: ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్యా కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటికే వివిధ కోణాలు తిరిగిన ఈ కేసు ఇప్పుడు మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జయరాంను హత్యా చేసింది ఒక్కరు కాదు, ఐదుగురు బయటి వ్యక్తులు ఉన్నారని, అందరూ కలిసే జయరాంను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

దెబ్బలు, పిడిగుద్దుల వల్లే జయరాం మృతిచెందినట్టు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు దర్యాప్తు అనంతరం ఈ హత్యలో ఐదుగురు పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విచారించాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. దీనికి నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ కూడా తీసుకున్నారు. జయరాం భార్య అయిన పద్మశ్రీ పిటిషన్‌లో ఉన్న అంశాలను బట్టి విచారణ కొనసాగిస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు పరిశీలించామని, శిఖా చౌదరిని కూడా విచారిస్తామని పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరూ తప్పించుకోలేరని డీసీపీ హెచ్చరించారు.