విచారణకు హాజరైన చిదంబరం

SMTV Desk 2019-02-09 07:38:04  Chidambaram, Karthi Chidambaram, INX Media Case, ED

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09: ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబందించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) కార్తీ చిదంబరం తండ్రి చిదంబరంను కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారి చేసింది. కాగా శుక్రవారం నాడు చిదంబరం ఈడీ ముందు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయనను అధికారులు దాదాపు 3గంటలపాటు విచారించారు. ఈ కేసుకు సంబంధించి తన కొడుకు కార్తిని గురువారం 6గంటలపాటు ప్రశ్నించింది ఈడీ.

కార్తీకి ఉన్న దేశవిదేశాల్లోని రూ.54 కోట్ల విలువైన ఆస్తులను ఈ కేసులో అటాచ్‌ చేసింది. 2007లో చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో రూ. 305 కోట్ల విదేశీ పెట్టుబడుల కోసం ఫారెన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు నిబంధనలను అతిక్రమించారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న కార్తి, ఐఎన్‌ఎక్స్‌ మీడియా డైరెక్టర్లు పీటర్, ఇంద్రాణి ముఖర్జీపై ఈడీ కేసు పెట్టింది. కార్తి తన పలుకుబడిని ఉపయోగించి ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు ఎఫ్‌ఐఎఫ్‌బీ క్లియరెన్స్‌ ఇప్పించడం కోసం లంచం తిసుకున్నరనే ఆరోపణలతో సీబీఐ గతేడాది ఫిబ్రవరి 28న ఆయనను అరెస్టు చేసింది. తరువాత ఆయన బెయిల్‌పై బయటకి వచ్చారు.