విజయనగరం జిల్లా వయస్సు ఎంతో తెలుసా?

SMTV Desk 2017-06-01 14:43:28  oddisha,vishakha,srikakulam,vijayanagaram

విజయనగరం, జూన్ 1 : రాజుల రాజ్యమైన విజయనగరం జిల్లాగా ఏర్పడేందుకు ముందు పెద్ద చరిత్రే నడిచింది. స్వాతంత్య్రానికి పూర్వం దేశంలోని పెద్ద జిల్లాల్లో విశాఖ ఒకటి.. అందుకే విశాఖను పరిపాలనా సౌలభ్యం నిమిత్తం నాలుగుసార్లు విభజించారు. అలా 1935లో ఒడిశా రాష్ట్రం ఏర్పడినప్పుడు విశాఖ జిల్లాలోని కొరాపుట్‌, గంజాం ప్రాంతాలను విడదీసి ఒడిశాలో కలిపేశారు. అనంతరం 1938లో బస్తర్‌, జయపూర్‌ ప్రాంతాలను ఒడిశాకు దారాదత్తం చేశారు. తిరిగి 1950లో రేగిన శ్రీకాకుళం ప్రత్యేక జిల్లా ఉద్యమానికి తలొగ్గి మూడోసారి విశాఖను విభజించి శ్రీకాకుళం జిల్లాను ఏర్పాటు చేశారు. # క్రమంగా పరిశ్రమల వైపు... * జిల్లా ఆవిర్భానికి ముందే పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. రానురాను జిల్లాలో కొన్ని పరిశ్రమలు పెట్టడం ప్రారంభమైంది. 1979లో జిల్లా ఆవిర్భవించే నాటికే గరివిడిలో ఫేకర్‌ పరిశ్రమతో పాటు మరికొన్ని ఫెర్రో పరిశ్రమలు నడిచేవి. * భీమసింగ్ బొబ్బిలి, సీతానగరం, ప్రాంతాల్లో చక్కెర కర్మాగారాలు కొనసాగేవి. విజయనగరంలో సర్వారాయ జౌళి పరిశ్రమ, అరుణా జూట్‌ మిల్లు, ఈస్ట్‌కోస్ట్‌ మిల్లు, సాలూరు, బొబ్బిలిలో గోగునార పరిశ్రమలుండేవి. * తర్వాత కాలంలోను ఫెర్రో, జూట్‌కి సంబంధించి మరెన్నో పరిశ్రమలొచ్చాయి. తద్వారా వేలసంఖ్యలో జిల్లాకు చెందిన ప్రజలు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. తాజాగా ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ­తం ఇవ్వడంతో కొన్నిపరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. # ఆవిర్భావం ఇలా... * 1950, 1952, 1967 విజయనగరాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమాలు, ఆందోళనలు సాగాయి. అప్పట్లో ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు పి.వి.జి.రాజు, కె.వి.ఆర్‌.ఎస్‌.సత్యనారాయణ(జామి), కొమ్మూరు అప్పడుదొర (భోగాపురం) వంటి నేతలంతా గట్టిపట్టే పట్టారు. * చివరికి అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చొరవతో 1979 జూన్‌ 1 వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని అయిదు తాలుకాలు(సాలురు, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం, చీపురుపల్లి), విశాఖ జిల్లాలోని నాలుగు తాలుకాలు(భోగాపురం, శృంగవరపుకోట, గజపతినగరం, విజయనగరం) కలిపి విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. * తర్వాత నెల్లిమర్ల, వియ్యంపేట, బాడంగి తాలుకాలు తీసుకొచ్చారు. అప్పటి 12 తాలుకాలే 34 మండలాలుగా రూపాంతరం చెంది నేటికీ కొనసాగుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక జిల్లాగా చేస్తే విజయనగరం అభివృద్ధి చెందుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. # జిల్లా నుంచి దేశస్థాయి వరకు... * జిల్లా ఆవిర్భావం నాటికి పార్వతీపురం ప్రాంతంలో చీకటి పరశురాంనాయుడు, బొబ్బిలి ప్రాంతంలో తెంటు లక్ష్మునాయుడు, నెల్లిమర్ల నుంచి పెనుమత్స సాంబశివరాజు, ఎస్‌.కోట ప్రాంతం నుంచి కోళ్ల అప్పలనాయుడు వంటివారు బలమైన నేతలుగా ఉండేవారు. 1978 నాటికే అశోక్‌గజపతిరాజు, పతివాడ నారాయణస్వామినాయుడులు సైతం జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. * ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకూ ఏ స్థానం నుంచి ఎవరిని నిలబెట్టాలన్నా పూర్తిగా పి.వి.జి.రాజు నిర్ణయమే శిరోధార్యంగా ఉండేది. తర్వాత కూడా జిల్లాకు చెందిన పలువురు నాయకులు దేశ, రాష్ట్రస్థాయిలో నాయకులుగా పేరొంది జిల్లాకు కీర్తి తీసుకొచ్చారు. * వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌, పూసపాటి అశోక్‌గజపతిరాజు, బొత్స సత్యనారాయణ, శత్రుచర్ల విజయరామరాజు, సుజయ్‌ కృష్ణరంగారావు రాజకీయాలను ప్రభావితం చేశారు.