టీడీపీ, వైసీపీల చూపు పవన్ వైపు

SMTV Desk 2017-08-02 17:20:27  TDP,YSRCP,Janasena, Pawan kalyan, Namdyala bypolls

నంద్యాల, ఆగస్టు 2: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు రాబోయే నంద్యాల ఉపఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇటు టీడీపీ, అటు వైసీపీ పార్టీలు జనసేన మద్దతు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ ప్రకటన కీలకం కాబోతుంది. 2019 సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఈ ఉపఎన్నికలు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. పవన్ కళ్యాణ్ సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ అయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, "నంద్యాల ఎన్నికల్లో జనసేన మద్దతు ఎవరికి అనేది రాబోయే రెండు రోజుల్లో ప్రకటిస్తాను" అని ఆయన ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. మరొక వైపు, రెండు పార్టీలు తమ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. నంద్యాల నియోజకవర్గంలో బలిజీలు, ముస్లింలు, వైశ్యా, రెడ్డి, ఎస్సీ, ఎస్టి ఓటర్లు ఉన్నారు. పవన్ తన మద్దతును తెదేపాకు ప్రకటిస్తే నియోజక వర్గంలో ఉన్న బలిజ ఓట్లతో పాటు, అక్కడ ఉన్న 25వేల నుంచి 35వేల మంది ఆయన అభిమానుల ఓట్లు ఈ పార్టీకి అనుకూలం కానున్నాయి. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ మా కుటుంబంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడని భూమా అఖిల ప్రియ మంగళవారం మీడియాకు తెలిపిన విషయం విధితమే.