ఈడీ విచారణకు హాజరైన ఇద్దరు రాజకీయ ప్రముఖలు

SMTV Desk 2019-02-08 08:34:35  Robbert Vadra, Karthi Chidambaram, Rahul Gandhi, Chidambaram, Money laundering case, INX Media Case, ED

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 08: ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా మనీ ల్యాండరింగ్‌ కేసులో వరుసగా రెండో రోజు గురువారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. వాద్రాను ముగ్గురు అధికారులు ఇంచుమించు 9 గంటలకుపైగా ప్రశ్నించారు. లండన్‌లో ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో బుధవారం వాద్రా ఇచ్చిన సమాధానాలపై సంతృప్తిచెందకపోవడంతో రెండో రోజు విచారణకు పిలిచింది ఈడీ. మొదటి రోజు మాదిరిగానే రెండో రోజు కూడా ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదుచేశారు. ఈ నెల 12న జైపూర్‌లో బికనీర్‌ భూకుంభకోణానికి సంబంధించి మరో మనీ ల్యాండరింగ్‌ కేసులో వాద్రా మళ్లీ ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు.



మరోవైపు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో గురువారం ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఇద్దరు ఒకేరోజు విచారణకు రావడంతో ఢిల్లీలోని జామ్‌నగర్‌ హౌజ్‌ ఈడీ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మీడియా ప్రతినిధులను నియంత్రించడానికి బారికేడ్లు ఏర్పాటుచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు కార్తీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. వాద్రా 11.25 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకే సంబంధించి పి.చిదంబరంను శుక్రవారం విచారించే అవకాశాలున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.