నల్గొండ నుంచి బరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

SMTV Desk 2019-02-07 18:50:39  komatireddy venkata reddy, nalgonda, congress, trs, 2019 elections

నల్గొండ, ఫిబ్రవరి 7: తెలంగాణాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జరగబోయే 2019 లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఈమద్యే తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు మెంబర్లను అభినందిస్తూ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ లోక్ సభ స్థానం నుంచి తనను గెలిపించాల్సిన బాధ్యత మీదేనని కార్యకర్తలకు, నేతలకు సూచించారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఓడిపోయిన నేతలు మనోధైర్యం కోల్పోవద్దని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెరాస ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ నిధులు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇంకా కేంద్రం నుంచి మంజూరయ్యే నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.