ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ గా షరీఫ్‌

SMTV Desk 2019-02-07 14:11:40  Sharif, Chandrababu Naidu, Faruq, Subramanyam

అమరావతి, ఫిబ్రవరి 07: ఆంధ్రప్రదేశ్ లో గురువారం శాసన మండలి చైర్మన్ గా టీడీపీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ ఎం.ఎ.షరీఫ్‌ ఎంపికయ్యారు. ఈ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్‌దాఖలు కావడంతో షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్‌చార్జి చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు షరీఫ్‌ను చైర్మన్‌ స్థానం వద్దకు తీసుకొని వెళ్ళగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఫరూక్‌ను మంత్రిగా, షరీఫ్‌ను చైర్మన్‌గా నియమించి మైనార్టీలకు రెండు కీలక పదవులు అప్పగించామని చెప్పారు. తెలుగు దేశం పార్టీ కి షరీఫ్ చాలా విలువైన సేవలందించారని పేర్కొన్నారు. షరీఫ్‌ ఆధ్వర్యంలో మండలిలో వ్యవహారాలు సజావుగా సాగాలని ఆకాంక్షించారు. షరీఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 1955 జనవరి 1న షరీఫ్‌ జన్మించారు. స్థానిక వైఎన్‌ కళాశాలలో బీకాం, భోపాల్‌లో ఎంకాం, ఎల్‌ఎల్‌బీ చదివారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో నూతనగా పార్టీలో చేరారు. అప్పటి నుంచి వివిధ పదవులు చేపట్టారు. ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన సేవల్ని గుర్తించిన పార్టీ ఎమ్మెల్సీగా, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా నియమించింది.