ఇస్రో సాధించిన మరో అద్భుత విజయం

SMTV Desk 2019-02-06 12:30:33  ISRO, GSAT30, Communication purpose, Arien space, VSAT networks, DTH Televishion, Telivision uplinks, Digital Sattelite, Space

ఫ్రెంచ్ గయానాలోకి కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌- 31‌ను విజయవంతంగా ప్రయోగించి తద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాదించినట్టయింది . భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువ జామున 2.31 గంటలకు జీశాట్‌ -31 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకుపోయిన ఏరియన్-5 రాకెట్‌ 42 నిమిషాల్లోనే నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. విజయవంతంగా నింగిలోకి పంపిన ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ సేవలకు ఉపయోగపడుతుంది. జీశాట్‌ -31తో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్‌ శాట్‌ -4 ఉపగ్రహం కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. జీశాట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు.

దీంతో నింగిలోకి ఇస్రో పంపిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల సంఖ్య 40కి చేరుకుంది. దాదాపు 2,536 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలను అందించనుంది. అత్యంత సమర్థవంతమైన కేయూ బ్యాండ్‌ ప్రసార వ్యవస్థ ఉన్న జీశాట్‌ -31 సంప్రదాయ ఉపగ్రహాలైన ఇన్‌శాట్‌, జీశాట్‌లకు ఆధునిక రూపమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భూభాగాలు, ద్వీపాలతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల గురించి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందజేస్తుంది. ఈ ఉపగ్రహం వీశాట్‌ నెట్‌వర్క్స్‌, టెలివిజన్‌ అప్‌లింక్స్‌, డిజిటల్‌ శాటిలైట్‌, డీటీహెచ్‌ టెలివిజన్‌, సెల్యులార్‌ బ్యాకప్‌లకు అనుకూలమైన సాంకేతికతతో రూపుదిద్దుకుందని ఇస్రో వెల్లడించింది. ఇప్పటికే భూస్థిర కక్ష్యలో ఉన్న ఇతర సమాచార ఉపగ్రహాలతో చేరి ఇది అదనపు సేవలు అందిస్తుంది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన ఈ ప్రయోగానికి ఇస్రో ప్రతినిధిగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరక్టర్ ఎస్ పాండ్యన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి లోపం తలెత్తకుండా ఈ ప్రయోగం విజయవంతమైందని అన్నారు. ఇన్‌శాట్ స్థానంలో జీశాట్-31ను ప్రయోగించామని తెలిపారు. ఈ ప్రయోగం కోసం గత జనవరి నుంచి ఇస్రో సిబ్బంది, ఏరియన్‌స్పేస్ తీవ్రంగా శ్రమించాయని పేర్కొన్నారు. అలాగే వచ్చే జూన్, జులైలో మరో సమాచార ఉపగ్రహం జీశాట్-30 ప్రయోగాన్ని ఇదే కేంద్రం నుంచి నిర్వహిస్తామని వెల్లడించారు. ఐరోపాలోని ఫ్రెంచ్ గయానాతో భారత్‌కు 1981 నుంచి అంతరిక్ష సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇవి క్రమంగా మరింత బలపడుతున్నాయని పాండ్యన్ వివరించారు.