ముఖ్యమంత్రి ఇలాంటి ధర్నాకు దిగడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు: యోగి అధిత్యనాథ్

SMTV Desk 2019-02-05 18:35:26  Yogi Adithyanath, Mamatha Banerjee, Amit Shah, BJP, TMC, Rajiv Kumar, CBI

కొలకత్తా, ఫిబ్రవరి 05: పురూలియా ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్రంగా విమర్శించారు. సీబీఐ కేస్ నేపథ్యంలో మమతా బెనర్జీ నిర్వహించిన ధర్నాపై ఆయన ఆక్షేపించారు. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ధర్నాకు దిగడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ర్యాలీలో పాల్గొన్న యోగి మమతా దీక్షను ఎద్దేవా చేశారు.

అవినీతిపై చేసే విచారణకు మమతా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా పురూలియా ర్యాలీకి హాజరయ్యేందుకు యోగి హెలికాఫ్టర్‌కు అధికారులు అనుమతి నిరాకరించడంతో లక్నో నుంచి జార్ఖండ్‌లోని బొకారోకు చాపర్‌లో వచ్చిన యోగి అక్కడి నుంచి 50 కిమీ దూరంలోని పురూలియాకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. మరోవైపు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రుల ర్యాలీలకు సైతం ఇటీవల బెంగాల్‌ ప్రభుత్వం అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇక కొలకత్తా పోలీస్ కమిషనర్‌ రాజీవ్ కుమార్ పై సీబీఐ అధికారుల దాడులకు నిరసనగా మమతా బెనర్జీ చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరింది.