ఎన్నికల ముందు ప్రజలకు బాబు వరాలు

SMTV Desk 2019-02-05 18:34:19  Andhra Pradesh, Yanamala Ramakrishnudu, AP Asembly Meeting, Budget, Vote on account

అమరావతి, ఫిబ్రవరి 05: ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో టిడిపి ప్రభుత్వం 2019-20 బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఈ సమావేశంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఉద్యోగులకు, రైతులకు, మహిళ సంఘాలకు వరాలను ప్రకటించింది. ఎన్నికల షెడ్యుల్ విడుదల సమయం సమీపిస్తున్న తరుణంలో ప్రజలను ఆకట్టుకొనేలా ఏపి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. గతంలో ప్రకటించిన పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. అందులో రైతులకు సుఖీభవ పేరుతో కొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లను కేటాయించింది. రైతులకు పెట్టుబడి కోసం ఈ పథకం కింద నిధులను అందించనున్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతిని వెయ్యి రూపాయాల నుండి రెండువేల రూపాయాలకు పెంచారు. ఈ పథకానికి రూ.1200 కోట్లను బడ్జెట్‌‌లో కేటాయించారు.

బీసీల్లోని అన్ని కులాలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు గతంలో ఉన్న ఫెడరేషన్లను కూడ ఫైనాన్స్ కార్పోరేషన్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు కాపు కార్పోరేషన్‌కు వెయ్యి కోట్లను కేటాయించారు. అంతేకాక బీసీల కోసం రూ. 3 వేల కోట్లను కేటాయించారు. డ్రైవర్స్ సాధికారిక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థకు రూ.150 కోట్లను కేటాయించారు. బీసీలతో పాటు బ్రాహ్మణ, ఆర్య వర్గాలకు కూడ కార్పోరేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు బ్రహ్మణ కార్పోరేషన్‌కు రూ.100 కోట్లు, ఆర్యవైశ్య కార్పోరేషన్‌కు రూ. 50 కోట్లు కేటాయించింది.

రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ ఉద్యోగుల పాత్రను ఆర్థిక మంత్రి యనమల ప్రశంసించారు. ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ స్కీమ్‌‌లో మార్పులకు కమిటీ ఏర్పాటు చేసింది. 70 ఏళ్లు దాటిన పెన్షన్ దారులకు 10 శాతం అదనంగా పెన్షన్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్వాక్రా సంఘాల మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద ఒక్కొక్కరికి రూ. 10వేలు చెల్లించాలని నిర్ణయించారు.