పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌కు కేంద్రం లేఖ

SMTV Desk 2019-02-05 17:48:35  Sharadha Chit Funds, Rajiv Kumar, Mamatha Banerjee, Supreme Court

కోల్‌కతా, ఫిబ్రవరి 05: శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణం గురించి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా కోల్‌కతా కమిషనర్‌గా ఉన్న రాజీవ్ కుమార్ ను సీబీఐ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారి చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కొద్ది గంటల వ్యవదిలోనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. సర్వీస్ నియమాలకు విరుద్ధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి దీక్షలో కూర్చున్న రాజీవ్ కుమార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్ సీఎస్‌కు లేఖ రాసింది. రాజీవ్ కుమార్ సర్వీస్ రూల్స్ పాటించనందున ఆయనపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేసింది.

శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసుకు సంబంధించిన సిట్ ప్రధానాధికారిగా ఉన్న కోల్‌కతా కమిషనర్ రాజీవ్ కుమార్‌ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధం కావడంతో ఈ వివాదం తలెత్తింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు సీబీఐకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో కేంద్రం మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. రాజీవ్ కుమార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు సూచించడంతో ఈ విషయం పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అన్నది ఆసక్తిరేపుతోంది.