నేటి అర్దరాత్రి నుంచి ఏపిలో బస్సులు బంద్

SMTV Desk 2019-02-05 17:28:36  Andhra Pradesh,RTC Strike, JAC, National Majdur Union

అమరావతి, ఫిబ్రవరి 05: ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అర్దరాత్రి నుంచే సమ్మె ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12వేల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈ సమ్మె లో మొత్తం 53 వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఆర్టీసీలో వివిధ సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మె చేయనున్నారు. జేఏసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా 12 రీజియన్లలో సమ్మెకు సన్నాహక కార్యక్రమాలు చేశారు. ఈ సమ్మె నోటీసులను 15 రోజుల ముందే అధికారులకు అందజేసారు. ఈ సమ్మె వల్ల ఆర్టీసీకి రోజుకి 13 కోట్ల రూపాయల వరకు నష్టం రానుంది. కార్మిక సంఘాలు ఈ సమ్మెకు రాజకీయ పార్టీల మద్దతు కోరారు.

ఈ సమ్మె సంక్రాంతికి ముందే జరగాల్సి ఉండగా సంక్రాంతి తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని యాజమాన్యం బహ్రోస ఇవ్వడం తో సమ్మెను వాయిదా వేసారు. కానీ పండగ తర్వాత జరిగిన చర్చల్లో కూడా తమ డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో జేఏసి కార్మికులు ఇప్పుడు సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ , స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, కార్మిక పరిషత్‌, వైఎస్‌ఆర్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌, బహుజన వర్కర్స్‌ యూనియన్‌లు ఈరోజు అర్థరాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటాయి. గురువారం అర్థరాత్రి నుంచి ఆర్టీసీలో అధిక సభ్యత్వం గల నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ సమ్మెలో పాల్గొంటుంది.