మమతా దీక్షపై జైట్లీ అనుమానం

SMTV Desk 2019-02-05 16:14:26  Arun Jaitley, Mamatha Benarjee, CBI

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 05: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేపట్టిన దీక్ష గురించి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారం పట్ల కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శలు గుప్పించారు. చికిత్స కొరకు అమెరిక వెళ్ళిన జైట్లీ అక్కడి నుండే ట్విట్టర్ లో స్పందించారు. కొలకత్తా పోలీస్ కమిషనర్ ను ప్రశ్నించేందుకు వెళ్ళిన సీబీఐపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ అతిగా స్పందించడం పలు అనుమానాలకు దారితీస్తుందని జైట్లీ అన్నారు.

కేవలం ఒక పోలీసు అధికారి కోసం మమత ధర్నా చేపట్టారనుకోవడం పొరపాటేనని, దీని వెనుక ఇంకేమైనా వ్యుహలున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర్నాకు ఇతర విపక్ష నేతల మద్దతుకు అర్థమేమిటని ప్రశ్నించారు. మిగిలిన ప్రతిపక్షాలను వెన్నక్కి తోసి రానున్న ఎన్నికల్లో తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకోవడం కోసమే ఆమె ధర్నా చేస్తున్నారని చెప్పారు. మమత దీక్షకు మద్దతు పలికిన ప్రతిపక్ష నేతలలో చాలా మంది అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నవారేనని జైట్లీ అన్నారు. అవినీతి పాలకులంతా ఏకమై దేశ పగ్గాలను చేపట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఎలాంటి సిద్ధాంతాలు లేని ఇలాంటి సంకీర్ణాలు దేశానికి విపత్తును కలిగిస్తాయని అన్నారు.