దుర్గ గుడిలో ప్రయోగాత్మకంగా రాహు-కేతువు పూజలు

SMTV Desk 2019-02-05 15:08:10  Vijayawada, Kanaka Durga Temple, Rahu-Kethuvu Pujalu

అమరావతి, ఫిబ్రవరి 05: విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో నూతన ఆర్జిత సేవలు ప్రారంభంకానున్నాయి. మాఘమాసం ప్రారంభం సందర్భంగా రేపటి నుండి రాహు-కేతు పూజలు ప్రారంభం కానున్నాయి. దేవస్థానం పండితులు, వేదపండితులు దిఇనికి సంభందించిన ఏర్పాట్లు పూర్తి చేసారు. కనకదుర్గను రాహువుకేతువులకు అధిష్టనదేవతగా కొలుస్తారు. అందుచేత దుర్గమ్మ సన్నిధిలో రాహు-కేతువుల పూజలు నిర్వహిస్తే భక్తులకు ఉండే కాల సర్ప దోషం, కుజదోషం, తొలగిపోయి వివాహ, సంతాన ప్రాప్తి తదితర కోరికలు నెరవేరతాయని వేదపండితులు చెబుతున్నారు.

ఈ పూజల నిర్వహణకు ఆలయ వైదిక కమిటీ ఇప్పటికే విధివిధానాలను రూపొందించింది. బుధవారం మాఘమాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా అదేరోజు నుంచి రాహు-కేతు పూజలను ప్రారంభించి.. నాలుగు రోజులపాటు అధికారులు, అనధికారులు, ప్రముఖుల సమక్షంలో ఈ పూజలను ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఈనెల 10వ తేదీ మాఘ శుద్ధ పంచమి (శ్రీ పంచమి) అమ్మవారి జన్మదినం కావడంతో ఆ రోజు నుంచి సాధారణ భక్తులను రాహు-కేతు పూజలకు అనుమతించాలని దేవస్థానం అధికారులు, పండితులు నిర్ణయించారు.