సీబీఐ ఎదుట రాజీవ్ కుమార్ హాజరు

SMTV Desk 2019-02-05 11:30:15  Ranjan Gogoi, Rajiv Kumar, CBI, KK Venugopal, Abhishek Manu Singhvi

కోల్‌కతా, ఫిబ్రవరి 5: శారద చిట్ ఫండ్ కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని సుప్రీమ్ కోర్ట్ తెలిపింది. ఈరోజు ఇరు పక్షాల వాదన విన్న తరవాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్ ఈ ఆదేశాలు ఇచ్చారు. రాజీవ్‌కుమార్‌ను షిల్లాంగ్‌లో సీబీఐ అధికారులు విచారించాలని తెలిపారు. రాజీవ్ కుమార్ ని అరెస్ట్ చెయ్యద్దని రంజన్ గోగోయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, డీజీపీ, రాజీవ్‌ కుమార్‌లకు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది. వీటికి సమాధానాలు ఫిబ్రవరి 18లో చెప్పాలని ఆదేశించింది.

అంతకు ముందు సీబీఐ తరఫు అటార్ని జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. అతి ముఖ్యమైన రుజువులను రాజీవ్‌ కుమార్‌ నిందితులకు అందజేశారని ఆరోపించారు. ముఖ్య సాక్ష్యాలను సిట్ సాయంతో స్థానిక అధికారులు ధ్వంసం చేశారని ఆరోపించారు. అనంతరం పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్‌ అభిషేక్‌ మను సింఘ్వి వాదిస్తూ, ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ లేదని మరి సాక్ష్యాలను రాజీవ్‌కుమార్‌ ధ్వంసం ఎలా చేస్తారని వాదించారు. రాత్రి సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేయలేదంటూ వీడియోను కోర్టుకు సమర్పించారు. ఇది కేవలం రాజకీయ కక్షతో ఎన్నికల ముందు సీబీఐ బెదిరిస్తోందని తెలిపారు.