దీక్షలో దీదీ...

SMTV Desk 2019-02-04 10:46:22  Mamatha Banerjee, Narendra Modi, Rajiv Kumar, CBI

కోల్‌కత, ఫిబ్రవరి 4: పశ్చిమ్‌బెంగాళ్‌లో రాజకీయ పరిస్థుతులు మరింత వేడెక్కాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న పోరు తారస్థాయికి చేరింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులను కోల్‌కత పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కోల్‌కత కమిషనరేట్ ఆఫీసు ముందు హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు, సీబీఐ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పటికే, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించింది.

సీబీఐ అధికారులు శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో భాగంగా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికివచ్చారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే సీబీఐని ఉపయోగించుకుని తమ మీద దాడి చేస్తోందంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ఆమె రోడ్డుపైనే నిరసన చేపట్టారు.

కుంభకోణం కేసులో ప్రమేయముందన్న ఆరోపణలపై కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు అడ్డుకుని నిర్బంధించారు. సీబీఐ ఆఫీసును సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, బీజేపీని చూసి అందుకే మమత భయపడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు చిట్‌ఫండ్ స్కామ్‌ను తెరమీదకు తీసుకొచ్చారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారి కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయణ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన సీబీఐ అధికారులను ఇప్పుడు పోలీసులు అడ్డుకున్నారు.