'భారత మన్‌ కీ బాత్' పేరుతో ప్రచారం, పనిచేసే వారిపైనే ప్రజల నమ్మకం: అమిత్‌ షా

SMTV Desk 2019-02-03 18:07:09  Amit Shah, Bharat Man Ki Baath, Election Campaign

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 3: భారతీయ జనతా పార్టీ(బీజేపి) జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. ఆయన ఆదివారం న్యూదిల్లీలో తమ పార్టీ సంకల్ప్‌ పాత్రా కార్యక్రమాన్ని ప్రారంభించి, భారత మన్‌ కీ బాత్ పేరుతో తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమిత్‌ షా పనిచేసే వారిపైనే ప్రజలు నమ్మకాన్ని ఉంచుతారు అనే నినాదంతో ఈ ఎన్నికల ప్రచారంలో తమ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. 2014కి ముందు 30 ఏళ్లు సంకీర్ణ ప్రభుత్వాలు కొనసాగాయి. అప్పట్లో ప్రభుత్వం అసలు పనిచేస్తుందా? అనే అనుమానం ప్రజల్లో ఉండేది. ఇటువంటి అనుమానాల మధ్య 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు భాజపాను గెలిపించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్ల కంటే అధిక సమయం ప్రభుత్వం కొనసాగితేనే అభివృద్ధి సాధ్యం అని వ్యాఖ్యానించారు.

ప్రచారంలో మాట్లాడుతూ అమిత్ షా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం. భాజపాలో అంతర్గతంగానూ ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇతర పార్టీలకు, మన పార్టీకి మధ్య చాలా తేడా ఉంటుంది. ఎన్నికలు కేవలం గెలుపుకోసం మాత్రమే కాదు. మన కార్యకర్తలకు సంబంధించి ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య వేడుకలా ఉంటాయి. ప్రజలను కలవడానికి కార్యకర్తలకు వచ్చిన ఓ మంచి అవకాశం ఇది. దేశ అభివృద్ధికి మార్గదర్శకాలయిన మన ఆలోచనలను వారికి తెలియచెప్పాలి. దేశ ప్రజల ఆశలను ప్రతిబింబించేలా మన పార్టీ మేనిఫెస్టోను రూపొందించే ప్రయత్నంలో ప్రతి రాష్ట్రంలో వారి అభిప్రాయాలను సేకరిస్తాం అని తెలిపారు.

అలాగే, ప్రజలు తమ సలహాలను పేపర్‌పై రాసి వేయడానికి బాక్సులు ఏర్పాటు చేస్తామని, ఈ-మెయిల్‌, కాల్ సెంటర్ల ద్వారా కూడా వారి సలహాలను సేకరిస్తామని అమిత్‌ షా తెలిపారు. భారత మన్‌ కీ బాత్ తమ పార్టీ కార్యక్రమం కాదని, ఇది దేశ ప్రజల కార్యక్రమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క నెలలో దేశంలోని తమ 11 కోట్ల కార్యకర్తలు 10 కోట్ల కుటుంబాలకు కలవాలని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి చెప్పాలని పిలుపునిచ్చారు. పనిచేసే వారిపైనే ప్రజలు నమ్మకాన్ని ఉంచుతారని పేర్కొన్నారు.