రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన అరుణ్ జైట్లీ

SMTV Desk 2019-02-03 16:26:22  Arun Jaitley, Rahul Gandhi, Kisan Sanman Nidi

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 3: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ తాజా బడ్జెట్‌లో రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అంటూ కేంద్రం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని హేళన చేయడాన్ని ఆయన తిప్పికొట్టారు. రాహుల్ కాస్త ఎదగాలని, ఆయన పోటీ చేస్తున్నది కాలేజీ యూనియన్ ఎన్నికల్లో కాదని, జాతీయ ఎన్నికల్లో అన్న విషయం గుర్తుంచుకోవాలని సెటైర్ వేశారు. రైతులకు కేవలం ఏడాదికి రూ.6 వేల మొత్తం అంటే రోజుకు రూ.17 ఇస్తారా, ఇది రైతులను అవమానించడమే అంటూ రాహుల్ ఈ పథకాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. అయితే భవిష్యత్తులో ఈ మొత్తాన్ని పెంచుతామని జైట్లీ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదాయ వనరులు వృద్ధి చెందుతున్న కొద్దీ ఈ మొత్తాన్ని పెంచుతామని స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ర్టాలు కావాలని అనుకుంటే, తమ సొంత నిధులతో ఈ మొత్తానికి ఇంకొంత కూడా జత చేయవచ్చని జైట్లీ సూచించారు. ఈ పథకం కింద దేశంలోని 12 కోట్ల మంది సన్న, చిన్నకారు రైతులకు లబ్ధి చేకురుతుందని జైట్లీ తెలిపారు. దీనికితోడు వివిధ పథకాల కింద వాళ్లకు ఓ ఇల్లు, రాయితీతో కూడిన ఆహారం, ఉచిత ఆరోగ్య సంరక్షణ, ఉచిత పారిశుద్ధ్యం, విద్యుత్తు, రోడ్లు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లు జైట్లీ వివరించారు.

రైతులకు మద్దతు కల్పించే ఈ పథకానికి ఇదే తొలి ఏడాది అని, ప్రభుత్వ ఆదాయ వనరులు పెరిగిన కొద్దీ ఈ మొత్తం పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక భూమిలేని 15 కోట్ల మంది మాటేమిటి అని ప్రశ్నిస్తే, వాళ్లకు ఉపాధి హామీ పథకంతోపాటు వివిధ ఇతర పథకాల లబ్ధి కలుగుతున్నదని చెప్పారు. ఈ కిసాన్ సమ్మాన్ నిధికి ఏడాదికి రూ.75 వేల కోట్ల ఖర్చవుతున్నాయి. దీనికి ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు అదనంగా రైతులకు కొంత మొత్తం ఇస్తున్నాయని, మిగతా రాష్ర్టాలు కూడా వాటి రూట్‌లో వెళ్లాలని సూచించారు.