శారద కుంభకోణం కేసులో పోలీస్ అధికారి పాత్ర

SMTV Desk 2019-02-03 14:23:58  Rajiv Kumar, Vinith Kumar Goyal, Thamal Kasu, Pallab Kanthi Ghosh, Mamatha Banerjee

కోల్ కత్తా, ఫిబ్రవరి 3: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో పలువురు ప్రముఖుల పాత్ర ఉన్నట్టు సమాచారం. తాజాగా ఈ కుంభకోణంలో కోల్ కత్తా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ శారదా స్కాం, రోజ్ వ్యాలీ పోంజీ కుంభకోణాలపై ఏర్పాటైన సిట్ దర్యాప్తు సరిగ్గా కాకపోవడానికి ఆయనే కారణమంటూ వెల్లడించింది. 1989 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ కనిపించడంలేదని, ఆయన కోసం వెతుకుతున్నట్లు తెలిపింది. విచారణ కోసం అతడికి రెండు సార్లు నోటీసులు పంపించామని, వాటిపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. దీంతో ఆయనను ఏక్షణంలోనైనా సీబీఐ అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో రాష్ట్రానికి చెందిన నలుగురు ఉన్నతాధికారులను ప్రశ్నించాలని భావిస్తున్నట్లు తెలిపింది. రాజీవ్ కుమార్, అడిషనల్ కమిషనర్ కోల్ కత్తా పోలీసు వినిత్ కుమార్ గోయల్, ఇన్స్ పెక్టర్ జనరల్ తమల్ బసు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పళ్లబ్ కాంతి ఘోష్ పేర్లు లేఖలో ఉన్నట్టు తెలిపింది.

గత కొన్నిరోజులుగా ఎన్నికల సంఘ సమావేశాలకు కూడా రాజీవ్ కుమార్ హాజరుకావడం లేదు. కాగా దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. రాజీవ్ హాజరు కాకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివరణను కోరింది. రాజీవ్ కుమార్ అదృష్యం కాలేదని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్టీ స్పందిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘానికి క్షమాపణలు చెబుతున్నాం. పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సెలవులో ఉన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఒకే చోట పని చేస్తున్నా లేదా సొంత రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులను బదిలీ చేయాలని తెలిపింది. దీనిపై ఫిబ్రవరి 15 లేదా 20 వరకు వొక నిర్ణయం తీసుకుంటాం. కమిషనర్ సెలవులో ఉన్నాడు, అని మమతా బెనర్జీ తెలిపారు.