అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం

SMTV Desk 2019-02-03 11:34:11  Amaravati, Andrapradesh, High court, Ranjan gogoy, CM Chandrababu, TDP

అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతంకానుంది. మరికొద్ది గంటల్లో నేలపాడులోని న్యాయనగరంలో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రారంభించనున్నారు. ఈ భవనాన్ని సీఆర్డీఏ ఎనిమిది నెలల కాలంలో పూర్తి శాండ్ స్టోన్ తో నిర్మించారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన శాండ్‌స్టోన్‌తో తాపడం చేశారు. దీంతో అందర్నీ ఆకర్షిస్తోంది హైకోర్టు భవనం. అత్యాధునిక వసతులతో, ఆకర్షణీయంగా భవనాలను నిర్మించారు. ఈ జుడీషియల్ కాంప్లెక్స్‌లోనే ఏపీ హైకోర్టును ఏర్పాటు చేశారు సీఆర్డీఏ అధికారులు.

ఈ భవనాలను భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ భవనం పక్కనే శాశ్వత హైకోర్టు భవనానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. శాశ్వత భవనం పూర్తయ్యాక తాత్కాలిక హైకోర్టు అందులోకి తరలించనున్నారు. ప్రస్తుత హైకోర్టులో సిటీ సివిల్‌ కోర్టులు, ట్రైబ్యునళ్లుగా వినియోగించనున్నారు. ఈ హైకోర్టు భవనాల నిర్మాణానికి రూ.173 కోట్లు వెచ్చించినట్లు సీఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. ఇకపోతే రంజన్ గొగోయ్ పర్యటన సందర్భంగా అమరావతిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.