'యాత్ర' పూర్తి స్థాయి బయోపిక్‌ కాదు : మమ్మూట్టి

SMTV Desk 2019-02-01 18:45:36  Yatra movie, Mammootty, YS Rajashekhar reddy, Mahi V Raghav

హైదరాబాద్, ఫిబ్రవరి 1: వైఎస్ రాజశేకర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. మళయాళ మెగాస్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో సమావేశమయ్యారు మమ్మూట్టి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు నాకు కొత్తేం కాదు. మలయాళంలో ఇలాంటి తరహా సినిమాలు కొన్ని చేశాను కాని బయోపిక్‌లో నటించడం మాత్రం ఇదే తొలిసారి. యాత్ర పూర్తి స్థాయి బయోపిక్‌ కాదు, వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగా మాత్రమె తెరకెక్కించారు అని అన్నారు. దర్శకుడు మహి పూర్తి స్క్రిప్ట్‌తో నా వద్దకు వచ్చారు, పాత్ర, భావోద్వేగాలు నాకు బాగా నచ్చాయి. పాదయాత్రలో వైఎస్సార్‌ ఎవర్ని కలుసుకున్నారు? వాళ్లు చెప్పిన సమస్యలు ఎలాంటివి? ఆయన వాటిని ఎలా పరిష్కరించారు? తదితర అనే విషయాల ఆధారంగా స్క్రిప్ట్‌ ఉంటుంది అని అన్నారు. నేను వైఎస్సార్‌ను అనుకరించలేదు అలాగే వొక మనిషి మరో మనిషిలా కనిపించడం కష్టం. సినిమా కోసం నేను ప్రత్యేకంగా ఎలాంటి పరిశోధనలు చేయలేదు, వైఎస్సార్‌తో కూడా నాకు ఎలాంటి అనుబంధం లేదు. కేవలం దర్శకుడు మహి రాసుకున్న స్క్రిప్ట్‌కు అనుగుణంగా నటించాను. ఈ కథలోని భావోద్వేగాలను బాగా అర్థంచేసుకున్నాను. తెలుగు, మలయాళం, తమిళం.. ఇలా ఏ భాషైనా భావోద్వేగాలు అర్థమవుతాయి. దాంతో నటించడం మరింత సులువైంది అని చెప్పుకొచ్చారు.

దర్శకుడు కేవలం రెండు సినిమాలు చేశాడు కానీ అనుభవం ఉందా లేదా అన్నది నేను పట్టించుకోలేదు. నా కెరీర్‌లో 70 నుంచి 80 మంది దాకా కొత్త దర్శకులే ఉన్నారు. వారితో పోల్చుకుంటే మహి అనుభవం ఉన్న దర్శకుడే. నేను పరిచయం చేసిన దర్శకులంతా ఇప్పుడు అగ్రస్థాయిలో కొనసాగుతున్నారు. ఈ సినిమా కోసం వైఎస్‌ కుటుంబీకులను కలవలేదు. సినిమా కోసం సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొన్నాను. భాష పరంగా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. తెలుగు, మలయాళం పదాలు 50 శాతం వొకలాగే ఉంటాయి. దాంతో నాకు సమస్య రాలేదు అని చెప్పారు. తెలుగు సినిమాలను తరచూ చూస్తుంటాను. భరత్‌ అనే నేను , రంగస్థలం సినిమాలను చూశాను. తెలుగు చిత్ర పరిశ్రమలో రకరకాల సినిమాలు తెరకెక్కుతుంటాయి. వాటిని ప్రేక్షకులు ఆదరించే విధానం కూడా బాగుంటుంది. తెలుగులో ప్రయోగాలు చేస్తూ కమర్షియల్‌ చిత్రాలు కూడా తీస్తున్నారు. నాకు డ్రీమ్‌ రోల్స్‌ అంటూ ఏం లేవు. ప్రతి సినిమా నాకు డ్రీమ్‌ రోలే అని అన్నారు. అనంతరం రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. సినిమానే నాకు రాజకీయం. నా దృష్టిలో నేను రాజకీయాల్లో ఉన్నట్లే. తెలుగులో నాకు చాలా మంది కథానాయకులు తెలుసు. ఎందుకంటే చాలా మంది మద్రాస్ నుంచి వచ్చినవాళ్లే ఉన్నారు. ఏవీఎం స్టూడియోస్‌లో పది అంతస్తులు ఉంటే వొక్కొక్క అంతస్తులో వొక్కో భాషకు చెందిన చిత్రీకరణ జరుగుతుండేది. అలా అన్ని భాషలకు చెందిన నటీనటులతో నాకు పరిచయం ఉంది. అలాగే నా కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి నటించలేదు. మంచి స్క్రిప్ట్‌ దొరికితే తప్పకుండా నటిస్తాను. ఇక మా అబ్బాయితో నాకు పోటీ నటనలో లేదు. నా భార్యకు ప్రేమను పంచడంలో ఉంది.