నెలకు 500 రూపాయలు ఇచ్చి రైతులను అవమానపరుస్తున్నారు: రాహుల్ గాంధీ

SMTV Desk 2019-02-01 16:49:30  Rahul Gandhi, Narendra Modi, Piyush Goyal, Union Budget Meeting, Kisan Sanmaan Needhi

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదాని అసమర్థత కారణంగా రైతుల జీవితాలు పాడవుతున్నాయని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ట్విట్టర్ లో స్పందిస్తూ రాహుల్ చిన్న, సన్నకారు రైతులకు ఏటా 6 వేల ఆర్థిక సాయం అందిస్తామనడం రైతులను అవమానపరచడమే అని విమర్శించారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ డియర్‌ నమో.. మీ ఐదేళ్ల అసమర్థ, అహంకారపూరిత పాలన మా రైతుల జీవితాలను నాశనం చేసింది. ఇప్పుడేమో రోజుకు 17 రూపాయలు ఇస్తామనడం రైతులను, వారి శ్రమను అవమానించడమే అని ట్వీట్‌ చేశారు. ఇది ఇలా ఉండగా తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి అనే పతాకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏటా 6 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ ఫథకం లక్ష్యం.