ఎస్బీఐ డేటా లీక్...!

SMTV Desk 2019-02-01 12:43:47  SBI, Customer Data Leak, SBI Quick, Tech Crunch

హైదరాబాద్, ఫిబ్రవరి 1: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐకి చెందిన ఖాతాదారుల డేటా ఉన్న సర్వర్ల నుంచి డేటా లీక్ అయింది. దీంతో లక్షల మంది ఎస్బీఐ కస్టమర్ల సెన్సిటివ్ డేటా ఆన్ లైన్ లీక్ అయినట్టు సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ టెక్ క్రంచ్ తెలిపింది. ఖాతాదారుల అకౌంట్ల వివరాలను హ్యాకర్లు సులువుగా తెలుసుకోవచ్చని, ఇప్పటికే లక్షలాది కస్టమర్ల ఫోన్‌ నెంబర్లు, బ్యాంక్ బ్యాలెన్స్, లావాదేవీలు, తదితర వివరాలు లీకయ్యాయని ప్రకటించింది. దీంతో ఎస్‌బీఐ కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు.

కస్టమర్ల డేటా ఉన్న సర్వర్ కు బ్యాంకు సిబ్బంది పాస్ వర్డ్ సెట్ చేయడం మరిచిపోవడంతో సర్వర్ నుంచి డేటా లీకయినట్టు టెక్ క్రంచ్ తెలిపింది. ఎస్బీఐ క్విక్ పేరుతో నిర్వహిస్తున్న అప్లికేషన్ కు లింక్ అయిన సర్వర్ డేటానే లీక్ అయింది. వొక మిస్‌డ్‌ కాల్‌ ద్వారా బ్యాంకింగ్‌ ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకునే సదుపాయమే ఎస్‌బీఐ క్విక్‌. ఎస్బీఐకి మొత్తం 50 కోట్ల మంది కస్టమర్లు ఉండగా.. వీళ్లలో ఎంత మంది డేటా లీక్ అయిందనే దానిపై స్పష్టత లేదు.

దీనిపై ఎస్బీఐ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. అత్యున్నత విలువలతో సేవలందిస్తున్న ఎస్‌బీఐ వినియోగదారుల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. అలాగే డాటాలీక్‌పై మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ట్వీట్ చేసింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.