ఎఫ్ బి లో ప్రేమజంట వీడియో.. పరారిలో యువకుడు...!

SMTV Desk 2017-08-01 15:00:26  thamilanadu, Viral on social media, Velumurugan Kolanginiathan of Perambalur region, social media, police

తమిళనాడు, ఆగస్టు 1 : ఓ ప్రేమ జంట ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కొందరు వ్యక్తులు వారిని బెదిరిస్తూ వీడియోలు తీసిన దానిపై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని చర్యలు మొదలు పెట్టారు. విషయంలోకి వెళితే... పెరంబలూరు ప్రాంతానికి చెందిన వేలుమురుగన్‌ కోలంగినాథన్ అనే యువకుడి ఖాతాలో ఓ వీడియో పోస్ట్ అయింది. బైక్ పై వెళుతున్న జంటను అటకాయించిన కోలంగినాథన్, వారిని కులం పేరుతో తిట్టాడు. దీంతో తాము ప్రేమికులమని, కేవలం మాట్లాడుకోవడానికి వచ్చామని, వీడియో తీయవద్దని, బైక్ వెనక కూర్చున్న యువతి ఎంత వేడుకున్నా వినలేదు. ఆఖరికి ఆ అమ్మాయి తమ భవిష్యత్తు నాశనమవుతుందని చెప్పినా పట్టించుకోపోగా, కోలంగినాథన్ సహా మరో ముగ్గురు నలుగురు అతని స్నేహితులు ఈ జంటను వేధించారు. ఆపై తాను తీసిన వీడియోను పేస్ బుక్ లో పోస్టు చేసి రాక్షసానందం పొందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కోలంగినాథన్ ఇంటి చిరునామా కనిపెట్టి వెళ్లగా, అప్పటికే పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడతామని వెల్లడించారు.