మహిళా ఓటర్లే టార్గెట్ గా రంగంలోకి రోజా...

SMTV Desk 2019-01-31 18:09:16  MLA Roja, YSRCP, TDP, Chandrababu, Andhrapradesh Assembly elections, Parliament elections

విజయవాడ, జనవరి 31: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో మహిళా ఓటర్ల కోసం తన పార్టీ ఎమ్మెల్యే రోజాను రంగంలోకి దింపారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ పథకాల పేర్లతో జిల్లాలు చుట్టేస్తూ మహిళా ఓటర్లే టార్గెట్ గా హామీల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాక వృద్ధులు, వికలాంగుల ఓట్లే టార్గెట్ గా హామీలపై హామీలు ఇచ్చేస్తున్నారు. అంతేకాదు సామాజిక వర్గాల వారీగా భారీ తాయిళాలే ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో దిట్ట అని చెప్పుకోవాలి. దీపం పథకం పేరుతో వొక ఎన్నికల్లో గట్టెక్కితే, డ్వాక్రారుణాల పేరుతో మరోసారి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. ఇలా రెండు సార్లు చంద్రబాబు అధికారంలోకి రావడానికి మహిళా ఓటర్లే కీలకం కావడంతో ఈసారి వారిని టార్గెట్ చేసుకుని హామీల వాన కురిపించారు. పసపు కుంకుమ పథకం కింద డ్వాక్రా గ్రూపులో ఉన్న ప్రతీ మహిళకు రూ.10వేలు ప్రకటించారు. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే వృద్ధులకు రూ.2000 పింఛన్ ప్రకటించారు. అలాగే వికలాంగులకు రూ.10వేలు పింఛన్ ప్రకటించారు. చంద్రబాబు హామీలకు కౌంటర్ గా వైసీపీ వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రోజాను రంగంలోకి దింపింది.

ఎమ్మెల్యే రోజాతో మహిళా స్వరం వంటి కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించింది. దీంతో సీఎం చంద్రబాబు జయహో బీసీ కార్యక్రమం ఎక్కడ అయితే నిర్వహించారో ఆ జిల్లాలోనే పోటీగా బహిరంగ సభకు ప్లాన్ చేసింది వైసీపీ. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఎమ్మెల్యే రోజా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహిళా స్వరం కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజానగరం నియోజకవర్గంలోని దివాన్ చెరువులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలపై విమర్శల దాడికి దిగారు. చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ దుమ్మెత్తిపోశారు. గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రూ.10వేలు ఇస్తానని చెప్పి నాలుగున్నరేళ్లు కాలయాపన చేసిన బాబు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ రూ.10వేలు తెరపైకి తెచ్చారని విమర్శించారు. స్మార్ట్ ఫోన్ లు ఇస్తామని చెప్పి బహిరంగ సభలకు పిలుపించుకుని ఆతర్వాత సొల్లు చెప్పి స్మార్ట్ గా పంపించలేదా అంటూ మండిపడ్డారు. పసుపు కుంకుమ పథకం కింద రూ.10వేలు ఇస్తామనడం వొక మోసం అన్న రోజా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తూ మహిళలను మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అటు చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆరేళ్ల చిన్నారి దగ్గర నుంచి 60ఏళ్ళ వృద్ధురాలి వరకు అత్యాచారాలు దాడులు జరిగాయని ఆరోపించారు.

మహిళా ఉద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడులకు దిగారని తెలిపారు. నారాయణ కళాశాలలో చదువుల తల్లులను పొట్టనబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ప్రైవేట్ కళాశాలలో అమ్మాయిలు హత్యలకు గురవుతుంటే వారిని కాపాడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమేనని దుయ్యబుట్టారు. ఎంతోమంది తల్లుల కడుపుకోత మిగిల్చిన చంద్రబాబును ఇంటికి పంపాల్సిన బాధ్యత ప్రతీ వొక్కరికీ ఉందని రోజా సూచించారు. వొకప్పుడు అంగన్వాడీ, ఆశ వర్కర్లు, మిడ్ డే మీల్ వర్కర్లపై దాడులు చేయించిన చంద్రబాబు ఇప్పుడు అమాంతం ప్రేమ వొలకబోస్తున్నారని అది ప్రేమ కాదని మరో మోసం అంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో చంద్రబాబు నాయుడు పతనం తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 మంది వైసీపీ అభ్యర్థులను, ముగ్గురు ఎంపీ అభ్యర్థులను గెలిపించి ఇక్కడ నుంచే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఎమ్మెల్యే రోజా సూచించారు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంలా ఉన్న మహిళలంతా కలిసి చంద్రబాబును గద్దె దింపి వైఎస్ జగన్ ను అధికారంలోకి తీసుకురావాలని రోజా సూచించారు.