సీబీఐ కేసు నుండి ముచ్చటగా ముగ్గురు తప్పుకున్నారు

SMTV Desk 2019-01-31 15:36:36  Nageshwar Rao, Ranjan Gogoy, Sikri, Ramana, CBI

న్యూ ఢిల్లీ, జనవరి 31: దేశంలో సంచలనం సృష్టిస్తున్న సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ కేసు వివాదం మరో మలుపు తిరిగింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ గా నాగేశ్వరరావును నియమించిన సంగతి తెలిసిందే. నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్‌ చేస్తూ కామన్‌ కాజ్‌ అనే ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే దీనిపై విచారణ జరపాల్సి ఉండగా న్యాయమూర్తులు వొకరి తర్వాత వొకరు తప్పుకుంటున్నారు. మొదటగా ఈ పిటిషన్‌ ను చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోని ధర్మసనానికి పిటిషన్ విచారణకు రాగా ఆయన తప్పుకున్నారు. సీబీఐ నూతన డైరెక్టర్‌ను ఎంపిక చేసే ఉన్నత స్థాయి సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని, అందువల్లనే ఈ పిటిషన్‌ను తాను విచారించలేనని చెప్పి గోగోయ్ తేలిపారు.

తరువాత ఈ కేసును జస్టిస్‌ సిక్రి నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పగించారు. సీబీఐ డైరెక్టర్‌ పదవి నుండిఆలోక్‌ వర్మను తొలగించిన కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందు వల్ల తాను కూడా ఈ విచారణ చెయ్యలేనని జస్టిస్‌ సిక్రి తెలిపారు. కాగా ఇప్పుడు ఈ కేసును జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పగించారు. కానీ ఆయన కూడా విచారణ నుండి తప్పుకుంటున్నట్టు తెలిపారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావు, తాను వొకే రాష్ట్రానికి చెందిన వ్యక్తులమని, ఆయన కుమార్తె వివాహానికి కూడా తాను హాజరయ్యానని పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. విచారణలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఈ కేసు విచారణ నుండి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసును తగిన ధర్మాసనానికి అప్పగించాలని సీజేఐ రంజన్‌ గొగొయ్‌ను జస్టిస్‌ రమణ కోరారు.