భారత్‌లో తగ్గుతున్న అవినీతి

SMTV Desk 2019-01-31 11:25:24  Bribery in India

న్యూ ఢిల్లీ, జనవరి 31: ఈమధ్య కాలంలో ఏ పని కావాలన్నా లంచం పెట్టాల్సిందే, ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగాలంటే చెయ్యి తడపాల్సిందే. చిన్నస్థాయి ఉద్యోగుల నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్, రాజకీయ నేతల వరకు ఇదే పరిస్థితి. అయితే, వొక సర్వే ప్రకారం గతంతో పోలిస్త మన దేశంలో అవినీతి తగ్గుముఖం పట్టిందన్నారు. గత ఏడాదికి తాజాగా ట్రాన్‌స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో భారత్‌ కాస్త మెరుగుపడింది. ఈ జాబితా ప్రకారం పోయిన ఏడాది భారత్‌ 81వ ర్యాంకింగ్‌లో ఉండగా ఈ తాజా జాబితాలో మూడు స్థానాలు మెరుగుపడి 78వ ర్యాంకుకు చేరింది.

ఇక పోతే, 2016లో భారత్‌ 79వ ర్యాంకులో ఉంది. అయితే, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు ట్రాన్స్‌పరెన్సీ ర్యాంకులు పడిపోయాయి. 2011 తర్వాత మొదటిసారిగా అమెరికా తొలి 20 దేశాల జాబితాలో చోటు సంపాదించలేక పోయింది. 2017లో 75 పాయింట్లతో 16వ ర్యాంకులో ఉన్న అమెరికా ఇప్పుడు 71 పాయింట్లతో 22వ స్థానానికి పడిపోయింది. చైనా ఏకంగా 77వ ర్యాంకు నుంచి 87వ ర్యాంకుకు దిగజారడం గమనార్హం. ఈ జాబితాలో అతి తక్కువ అవినీతితో డెన్మార్క్‌, న్యూజిలాండ్‌లు ర్యాంకింగ్‌లో తొలి రెండు స్థానాల్లో ఉండగా, దక్షిణ సూడాన్‌, సోమాలియాలు అట్టడుగున ఉన్నాయి.