భూకర్షణమ్ కార్యక్రమం: హాజరవుతున్న ఏపీ సీఎం

SMTV Desk 2019-01-30 18:20:31  Bhukarshnam, Amaravathi, Venkateshwara Temple, AP CM Chandra babu, Ministers, Puja, TTD, TTD EO Anil Kumar Singal

అమరావతి, జనవరి 30: అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణంలో కీలకమైన భూకర్షణమ్ కార్యక్రమం రేపు జరగనుంది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. దీనికి సంబందించిన అన్ని ఏర్పాట్లను టీటీడీ సిద్ధం చేసింది. ఏపీ రాజధానిలో రూ.150 కోట్ల నిధులతో ప్రతిష్టాత్మకంగా శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.

ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాలు వొక ఎత్తు అయితే .. అమరావతిలో స్వామి వారి ఆలయ నిర్మాణం మరొక ఎత్తని అన్నారు. ప్రస్తుతం 7 ఎకరాల విస్తీర్ణంలో రాళ్లతో ఆలయం కడుతున్నామని, మిగిలిన 18 ఎకరాల్లో నిర్మాణాలకు ప్లాన్ సిద్ధమవుతోందని టీటీడీ ఈవో వివరించారు. రానున్న రెండేళ్లలో నాలుగు దశల్లో ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. కాగా రేపటి నుంచి మరో 10 రోజులపాటు జరిగే వైదిక కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసామని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణానికి దాతలు కూడా ముందుకు వస్తున్నారని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రేపు జరగనున్న ఆలయ నిర్మాణంలోని కీలకమైన భూకర్షణమ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు.