చంద్రబాబుకి సవాల్ విసిరిన బొత్స..

SMTV Desk 2019-01-30 17:09:30  Chandrababu, TDP, AP Elections, Botsa satyanarayana, ycp, ap special status

విజయవాడ, జనవరి 30: వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఈరోజు విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొచ్చేందుకు వైసీపీ ఎప్పుడు కట్టుబడి ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలు కేవలం రాజకీయ లబ్ది కోసమే బంద్ నిర్వహిస్తున్నారన్నారు. వైసీపీ ప్రత్యేకహోదా కోసం బంద్ నిర్వహించినప్పుడు ఈ నేతలే తమపై విమర్శలు చేశారని గుర్తుచేశారు. అప్పుడు తమ నేతలని అరెస్ట్ చేసి జైలులో కూడా పెట్టారని పేర్కొన్నారు. వారే ఇప్పుడు ప్రత్యేకహోదా పేరుతో బంద్ కు పిలుపునిచ్చారని వ్యాఖ్యానించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలపై ఢిల్లీలో వైసీపీ నేతలు ఆందోళన చేస్తే.. ‘ఢిల్లీలో ధర్నా చేస్తే ఏం ప్రయోజనం? అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారని అన్నారు. హోదా విషయమై వైసీపీ గుంటూరులో ధర్నా చేస్తే..‘ఇక్కడ చేసి ఏం ప్రయోజనం. ఢిల్లీకి వెళ్లండి అని చెప్పారని వ్యాఖ్యానించారు. ఇక ఏపీ అభివృద్ధి కోసం 29 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిశానని చంద్రబాబు చెప్పడాన్ని బొత్స తీవ్రంగా తప్పుపట్టారు. బాబు ఈ విషయాన్నీ నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ‘ఈ 29 సార్లలో ఓ మూడింటిని వదిలేద్దాం.. మిగిలిన 26 సార్లు మోదీని కలిసి చంద్రబాబు ప్రత్యేకహోదాపై లేఖలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని సవాల్ విసిరారు. ఫిబ్రవరి 1న జరిగే బంద్ కు తాము మద్దతు ఇవ్వవడం లేదని స్పష్టం చేసారు.