యువ రైతుల పెళ్లికి లక్ష రూపాయల బహుమతి

SMTV Desk 2019-01-30 16:35:31  Young Farmers Marriages, 1 Lakh price money

బెంగళూరు, జనవరి ౩౦: ఆడపిల్లలకు పెళ్లిళ్లు చెయ్యాలంటే మొదటగా వచ్చే మాట అబ్బాయి ఏం చేస్తుంటాడు అని. ఇక ఈకాలం అమ్మాయిలు అయితే మంచి ఉద్యోగం, అందం, అస్తి ఇలా వొక జాబితానే తయారు చేసి పెట్టుకున్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, యువ రైతుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. వ్యవసాయం చేసే అబ్బాయిల పైన అంతగా ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని యల్లాపుర ప్రాంతానికి చెందిన ఆనగోడ గ్రామ సేవా సహకార సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ గ్రామానికి చెందిన యువ రైతులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఆ గ్రామానికి చెందిన యువకులు తమ సహకార సంఘంలో చేరాల్సి ఉంటుందని తెలిపింది. కులాల ప్రసక్తి ఇందులో లేదని తేల్చిచెప్పింది. ఆ గ్రామానికి చెందిన అమ్మాయిలే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల యువతులు కూడా రైతులను పెళ్లాడవచ్చు అని తెలిపింది. ఈ ఏడాది మార్చి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతామని పేర్కొంది.