భానుప్రియపై మరో కేసు నమోదు....!

SMTV Desk 2019-01-30 14:08:03  Bhanupriya, Child labor, Police case

హైదరాబాద్, జనవరి 30: ప్రముఖ సినీ నటి భానుప్రియ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వివాదం కాస్త రోజురోజుకి మరింత పెద్దదిగా మారుతుంది. గతేడాది భానుప్రియ తన ఇంట్లో సామర్లకోటకు చెందిన ప్రభావతి కూతురైన సంధ్యను పనికి పెట్టుకుంది. అయితే సంధ్యను భానుప్రియ వేధింపులకు గురి చేస్తోందని, అంతేకాక భానుప్రియ సోదరుడు లైంగిక దాడి చేస్తున్నట్లు తన తల్లి ప్రభావతి పోలీసులను ఆశ్రయించింది. విషయం పెద్దది కావడంతో మీడియా ముందుకొచ్చిన భానుప్రియ.. సంధ్యను బాగానే చూసుకుంటున్నామని, ఆమె ఇంట్లో దొంగతనాలు చేస్తుండడంతో ప్రభావతిని పిలిచి వారించామని, దొంగిలించిన సొమ్ముని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరామని, దాంతో ప్రభావతి రివర్స్ అయి తమపై కేసు పెట్టిందని భానుప్రియ వెల్లడించింది.

ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు భానుప్రియపై మరో కేసు పెట్టారు. మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడం, హింసించడం వంటి నేరాల కింద ఏపీ డీజీపీకి బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని వినతి పత్రం అందించింది. దీంతో ఇప్పుడు భానుప్రియ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకున్నట్లుగా కనిపిస్తోంది.