వైసీపీపై మండిపడ్డ లోకేష్...

SMTV Desk 2019-01-30 11:35:22  Jaganmohan Reddy, nara lokesh, ycp, tdp, trs, kcr

అమరావతి, జనవరి 30: ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష వైసీపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. విభజన తరువాత రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించిన ఆయన విభజన హామీల విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయంపై కలిసి పోరాడాల్సిన సమయంలో వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.

కాగా, ఏ ఎజెండాతో తెరాసతో కలిసి నడుస్తున్నారని ప్రశ్నించారు. తెరాస అధినేత కేసీఆర్‌ ఆంధ్ర ప్రజలను రాక్షసులు అన్న విషయాన్ని మరచిపోయారా? లేక తెలంగాణాలో 35 ఉపకులాలను బీసీల జాబితా నుంచి తొలగించినందుకా? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసిన కూటమిలో టీఆర్‌ఎస్‌, వైసీపీ తప్ప మరే పార్టీలూ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని పదేపదే చెబుతున్న బీజేపీ నేతలు, వారి వద్ద ఏమైనా సాక్ష్యాలుంటే చూపించాలని డిమాండ్ చేశారు.