మరోసారి ఏపీ కి వెళ్లనున్న తెలంగాణ సీఎం

SMTV Desk 2019-01-29 16:52:33  KCR, Telangana, Andhra Pradesh, vizag tour, Swarupananda Swamy, KTR, Sharada pitam, Jagan Federal Front

హైదరాబాద్, జనవరి 29: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ కి వెళ్లనున్నారు. వచ్చేనెల 10న విశాఖలో జరగనున్న శారదాపీఠం వార్షికోత్సవాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో వచ్చేనెల 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఇటీవల ఎర్రవల్లిలో కేసీఆర్ ఐదురోజుల పాటు నిర్వహించిన సహస్ర చండీ యాగానికి శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలోనే పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాల్సిందిగా కేసీఆర్‌ను స్వరూపానంద స్వామి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చేనెల 14న సీఎం కేసీఆర్ విశాఖ వెళ్లి శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. అక్కడ జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొంటారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. డిసెంబర్ నెలలో ఫెడరల్ ఫ్రెంట్‌కు సంబంధించి టూర్‌కు బయలుదేరిన సమయంలో మొదటగా కేసీఆర్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు.

మరోవైపు రాజకీయ వర్గాల్లో సీఎం కేసీఆర్ విశాఖలో రెండోసారి పర్యటించనుండడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేసీఆర్ సూచన మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌‌ను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారు. జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, త్వరలోనే కేసీఆర్ ఏపీకి వెళ్లి జగన్‌తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తారని తెలిపారు. విశాఖలో పర్యటించనున్న సీఎం కేసీఆర్, అక్కడి నుంచి నేరుగా వెళ్లి జగన్‌ను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది.