చక్రపాణి చక్రాలు వైసీపీ వైపు...!

SMTV Desk 2017-08-01 11:06:33  YSRCP, Namdyala Bypoll, Shilpa Chakrapani Reddy, TDP MLC Chakrapani Shock

నంద్యాల, ఆగష్టు 1: ఇటీవల నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణించిన కారణంగా నంద్యాల ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తమైంది. కాగా మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఉపఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నో తర్జనభర్జనల అనంతరం తమ అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగగా, ఆయన సోదరుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వైకాపాలో చేరేందుకు రంగం సిద్దమైనట్టు వస్తున్న వార్తలు కలకలం రేకెస్తున్నాయి. నేటి మధ్యాహ్నం కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై వారితో చర్చించిన తరువాత, ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ఈ విషయమై చక్రపాణి రెడ్డిని ఆపేందుకు చంద్రబాబు నాయుడు స్వయంగా ఎంపీ సీఎం రమేష్ ను రంగంలోకి దించగా, పార్టీని వీడ వద్దని ఆయన మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికలలో తెదేపా భూమా బ్రహ్మానందరెడ్డి పేరు ప్రకటించిన తరువాత, శిల్పా మోహన్ రెడ్డి వైకాపాలో చేరిపోయిన సంగతి తెలిసిందే. తన అన్నను ఆపడంలో విఫలమయ్యారని తెలుగుదేశం నేతలు శిల్పా చక్రపాణి రెడ్డిపై ఆరోపణలు చేసారు కూడా. ఇటీవలి చంద్రబాబు నంద్యాల పర్యటనలో చక్రపాణిని దూరం పెట్టారని సమాచారం. నంద్యాలలో వైఎస్ జగన్ ఈ నెల 3వ తేదీన పర్యటించనున్నారు, ఆ సమయంలోనే చక్రపాణి వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారని టిడిపి శ్రేణుల్లో గుసగుసలు మొదలయ్యాయి.