జార్జ్ ఫెర్నాండేజ్ క‌న్నుమూత‌

SMTV Desk 2019-01-29 16:18:26  George Fernandes, Atal Bihari Vajpayee, Defence Minister

న్యూ ఢిల్లీ, జనవరి 29: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. 88 సంవత్సరాల ఫెర్నాండెజ్ గత కొన్నేల్లుగా అల్జీమర్స్ తో బాధపడుతూ ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం స్వైన్ ఫ్లూ కూడా సోకింది. చికిత్సను తట్టుకోలేక ఈ రోజు ఉదయం మరణించారు. ఫెర్నాండెజ్ కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఇదివరకు ఫెర్నాండెజ్ అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రక్షణమంత్రిగా పనిచేశారు. భారత్‌-పాక్‌ మధ్య కార్గిల్‌ యుద్ధం ఈయన రక్షణమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది.

ఈయన 1930 జూన్ 3న మంగళూరులో జన్మించారు. 1967 నుంచి 2004 వరకు 9 సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. జనతాదళ్ పార్టీలో కీలక నేతగా ఎదిగి, ఆపై సమతా పార్టీని స్థాపించారు. రక్షణ శాఖతో పాటు సమాచార, పరిశ్రమల, రైల్వే శాఖలను కూడా నిర్వహించారు. ఫెర్నాండెజ్ మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం వెలిబుచ్చారు.